భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదాలకు స్వస్తి చెప్పి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని, అందుకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో టీవీ డిబేట్ లో పాల్గొనాలని ఉందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు దెబ్బతిన్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడ్డానికి తాము ప్రయత్నిస్తామని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ రష్యా టుడేకి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సహకారంపై చర్చల కోసం రష్యా పర్యటనకు వెళ్లనున్న ఇమ్రాన్.. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఒక పాక్ నాయకుడు రష్యాకు వెళ్తున్నాడు.
చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించగలిగితే అది భారత ఉపఖండంలోని ఎంతోమంది ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ తో వ్యాపారం చేయలేకపోతున్నామన్నారు. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితే వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని ఇది ఇరు దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు. చర్చల విషయంలో భారత్ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఉగ్రవాదం, చర్చలు ఒకదానికొకటి కలిసి సాగలేవని తేల్చి చెప్పింది. రష్యాతో తమకు ఇప్పటికే ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు.