పాకిస్థాన్ పాపాల కుండ నిండింది.. చైనా క్షిపణిని కూడా కూల్చాం : భారత సైన్యం
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం త్రివిధ దళాల డీజీలు సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు.
By Medi Samrat
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం త్రివిధ దళాల డీజీలు సోమవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ గురించి మరింత సమాచారం ఇచ్చారు. ఈ ఆపరేషన్ సమయంలో భారత సైన్యం పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాటు పాకిస్థాన్‌కు చెందిన 11 ఎయిర్‌బేస్‌లు కూడా భారీగా దెబ్బతిన్నాయి.
ఉగ్రవాదుల కోసం పాక్ సైన్యం జోక్యం చేసుకోవడం బాధాకరమని, అందుకే స్పందించాలని నిర్ణయించుకున్నామని ఎయిర్ మార్షల్ ఎకె భారతి అన్నారు. మా పోరాటం ఉగ్రవాదులు, వారి సహాయక నిర్మాణాలపైనే తప్ప పాకిస్థాన్ సైన్యంపై కాదన్నారు. మన ఆయుధాలు కాల పరీక్షగా నిలిచాయి. మన స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థ 'ఆకాశ్' బాగా పనిచేస్తోందని తెలిపారు.
మేము చైనా PL-15 క్షిపణిని కూల్చివేసాము. దాని ముక్కలు మా వద్ద అందుబాటులో ఉన్నాయి. లాంగ్ రేంజ్ క్షిపణిని కూడా కూల్చివేశామని తెలిపారు. మన రక్షణ వ్యవస్థలు దేశానికి గోడలా నిలిచాయి, వాటిలోకి శత్రువులు చొచ్చుకుపోకుండా చేశామన్నారు.
డీజీఎంవో లెఫ్టినెంట్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అమాయక పౌరులపై దాడులు జరిగాయి. పాకిస్థాన్ పాపాల కుండ నిండిందన్నారు. మా ఎయిర్‌ఫీల్డ్‌లు అన్ని విధాలుగా పనిచేస్తాయి. మన వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్థాన్ డ్రోన్లు, UAVల దాడులను విఫలం చేసిందని తెలిపారు. నేను మన బిఎస్‌ఎఫ్‌ని ప్రశంసించాలనుకుంటున్నాను. డైరెక్టర్ జనరల్ నుండి సరిహద్దులో ఉన్న చివరి సైనికుడి వరకు అందరూ ఈ ఆపరేషన్‌లో చురుకుగా పాల్గొన్నారు. వారు చాలా ధైర్యంగా మాకు మద్దతు ఇచ్చారని కొనియాడారు.
భారత సైన్యం యొక్క నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ శివ తాండవ్ ప్రతిధ్వనితో ప్రారంభమైంది. నేడు రాంధారి సింగ్ దినకర్ యొక్క ప్రసిద్ధ కవిత - "యచ్నా నహీ, అబ్ వార్ హోగా...."తో ప్రారంభమైంది. అంతకుముందు, త్రివిధ దళాల అధిపతులు ఈ ఉదయం ప్రధాని మోదీతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.