పహల్గామ్‌లో 26 మంది హత్యకు సూత్రధారిగా గుర్తించబడిన హషీమ్ ముసా పాకిస్తాన్‌లో ఎలైట్ పారా-కమాండో శిక్షణ పొందాడని భావిస్తున్నారు. ఇది జమ్మూ కశ్మీర్‌లో అతని ఉగ్రవాద కార్యకలాపాలకు సమర్థవంతంగా సహాయపడిందని భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. కథువా, సాంబా సెక్టార్ల ద్వారా భారత భూభాగంలోకి చొరబడిన మాజీ సైనికుడు మూసా అని సమాచారం. చొరబాటు తర్వాత, అతను రాజౌరి-పూంచ్‌లోని డేరా కి గలి ప్రాంతంలో యాక్టివ్ గా ఉన్నాడు. అక్కడ లష్కరే తోయిబా (LeT) మాడ్యూల్ లో భాగంగా గత సంవత్సరం భద్రతా దళాలపై అనేక దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
భద్రతావర్గాల సమాచారం ప్రకారం, ఈ తీవ్ర వాద బృందం ప్రవర్తన.. యుద్ధ శిక్షణను సూచిస్తుంది. ఉగ్రవాదులు పోలీసు, సైనిక గస్తీ బృందాలను విజయవంతంగా తప్పించుకున్నారు, పౌరులతో సంబంధాన్ని నివారించుకుంటూ నిరంతరం కఠినమైన పర్వత అడవుల గుండా కదిలారు. ముఖ్యంగా ఆహారం కోసం చుట్టుపక్కల గ్రామాలకు చేరుకోలేదు. గతంలో చొరబాటుదారులు అలసట, స్థానిక మద్దతుపై ఆధారపడటంతో అధికారులకు సమాచారం అందుతూ ఉండేది. ప్రొఫెషనల్ సైనిక శిక్షణ తీసుకున్నారనే దానికి మరొక సూచిక పహల్గామ్ దాడి సమయంలో M4 కార్బైన్‌లతో సహా అధునాతన ఆయుధాలను ఉపయోగించడం. ఈ ఆయుధాలకు ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరం.