యూపీ ఎన్నికలు : 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఒవైసీ
Owaisi releases first list of candidates. యూపీ ఎన్నికలు : 9 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఒవైసీ
By Medi Samrat
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే పలు పార్టీలు అభ్యర్ధులను ప్రకటించారు. ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా యూపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఒవైసీ విడుదల చేశారు. ఏఐఎంఐఎం విడుదల చేసిన మొదటి జాబితాలో.. ఘజియాబాద్‌లోని లోని నియోజకవర్గం నుంచి డాక్టర్ మహతాబ్, హాపూర్ లోని గర్హ్ ముక్తేశ్వర్ నియోజకవర్గం నుంచి ఫుర్కాన్ చౌదరి, హాపూర్ లోని మరో నియోజకవర్గం ధౌలోనా నుంచి నియోజకవర్గం హాజీ ఆరిఫ్ బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు.
ఇక మీరట్ లోని సివాల్ ఖాస్ నియోజకవర్గం నుంచి రఫత్ ఖాన్, మరో నియోజకవర్గం సర్ధన నుంచి జీషన్ ఆలం, మీరట్ నుంచి కిథోర్, సహారన్‌పూర్ నియోజకవర్గం నుంచి అమ్జద్ అలీ బెహత్, బరేలీ-124 నియోజకవర్గం నుంచి షహీన్ రజా ఖాన్, సహరాన్‌పూర్ దేహత్ నియోజకవర్గం నుంచి మార్గుబ్ హసన్ లు ఆయా స్థానాల్లో అసెంబ్లీ బరిలో ఉండనున్నట్లు ప్రకటించారు. ఒవైసీ విడుదల చేసిన తొలి జాబితాలో ముస్లిం అభ్యర్థులకే అవకాశం కల్పించారు. ఒవైసీ తన అభ్యర్థులను నిలబెట్టిన స్థానాలన్నీ ఉత్తరప్రదేశ్‌లోని ముస్లీం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలుగా చెబుతారు. ఇదిలావుంటే.. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు మౌలానా నోమానీ అసదుద్దీన్ ఒవైసీకి లేఖ రాశారు. విజయం ఖాయమైన స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టాలని లేఖలో సూచించారు.