దేశంలో కరోనా విజృంబిస్తుంది. సామాన్యుడి నుండి సెలబ్రిటీ వరకూ ఎవ్వరిని వదలట్లేదు. తాజాగా.. 400 మంది పార్లమెంట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఢిల్లీలో అకస్మాత్తుగా పెరుగుతున్న కొత్త కేసుల దృష్ట్యా పార్లమెంట్ ఉద్యోగులకు జనవరి 6-7 తేదీలలో పరీక్షలు నిర్వహించారు. జనవరి 4 నుండి 8 వరకు రాజ్యసభ సెక్రటేరియట్ లో 65 మంది, లోక్‌సభ సెక్రటేరియట్ లో 200 మంది, పార్లమెంట్‌లో పనిచేస్తున్న 133 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది హాజరుపై నిషేధం విధించారు. తాజా సూచనల ప్రకారం.. అండర్ సెక్రటరీ/ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు కంటే తక్కువ ఉన్న 50 శాతం మంది అధికారులు, ఇతర ఉద్యోగులు ఈ నెలాఖరు వరకూ ఇంటి నుండి పని చేయాల్సిందిగా ఆదేశించారు. మొత్తం ఉద్యోగులలో వీరు 65 శాతం ఉన్నారు.
వికలాంగులు, గర్భిణీ స్త్రీలు కార్యాలయాల్లో ఉండటంపై మినహాయింపు ఇచ్చారు. అన్ని అధికారిక సమావేశాలు వర్చువల్‌గా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే.. 1300 మంది అధికారులు, ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారు. ఇన్ఫెక్షన్ ఉన్న వారికి నయమయ్యేవరకూ కఠినమైన పర్యవేక్షణ అవసరమని.. అవసరమైతే ఆసుపత్రిలో చికిత్సకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో 20,181 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 7 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 25,143కి పెరిగింది.