ఆదివారం మధ్యాహ్నం పోలీసులు సీజ్ చేసిన వాహనాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. నైరుతి ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో బైక్‌లు, కార్లతో సహా 350కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన సాగర్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం సంభవించలేదు. సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, వస్తువులలో మంటలు చెలరేగాయని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సౌత్ వెస్ట్ గౌరవ్ శర్మ తెలిపారు.
"ఆ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలు కాలిపోతున్నాయని విధుల్లో ఉన్న అధికారి గమనించినప్పుడు, అతను వెంటనే అగ్నిమాపక విభాగానికి కాల్ చేశాడు. చాలా గంటల ప్రయత్నం తర్వాత, మంటలను ఆర్పివేశారు. ఆ సమయానికి, 250 మోటార్ సైకిళ్ళు, 100 కార్లు పూర్తిగా కాలిపోయాయి" అని అన్నారు గౌరవ్ శర్మ. ఆదివారం దగ్ధమైన వాహనాల్లో ఎక్కువ భాగం ప్రమాదాలు జరిగిన వాహనాలే.. వాటిని సీజ్ చేసి అక్కడ ఉంచారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం సంఘటనా స్థలానికి వెళ్లి మంటలకు కారణాన్ని తెలుసుకోవడానికి అన్ని నమూనాలను సేకరించిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.