గుజరాత్ రాష్ట్రంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అహ్మదాబాద్ నగరంలో 351 మంది పోలీసు అధికారులు కోవిడ్ -19 బారిన పడ్డారని సీనియర్ పోలీసు అధికారులు సోమవారం తెలిపారు. గుజరాత్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భాటియాకు కూడా గత వారం కోవిడ్ -19 కు నిర్దారణ అయ్యింది. వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. భాటియా గైర్హాజర్ కావడంతో విధులు నిర్వహించడానికి ఐపీఎస్ టీఎస్ బిష్త్‌కు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (కంట్రోల్) హర్షద్ పటేల్‌ను మాట్లాడుతూ.. ''చాలా మంది సిబ్బంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎవరూ కూడా సీరియస్‌గా లేరని చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్‌కు ఇప్పటివరకు ఎవరూ పాజిటివ్ పరీక్షించలేదని కూడా ఆయన తెలియజేశారు. హోంగార్డులు, ఎస్‌ఆర్‌పీ జవాన్లతో సహా అన్ని పోలీసు, రాష్ట్ర సిబ్బందికి బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందని అన్నారు.
"బూస్టర్ డోసు డ్రైవ్ ప్రారంభమైంది, దాదాపు 4,000 మంది సిబ్బందికి ఇప్పటికే టీకాలు వేయబడ్డాయి. హోంగార్డులు, ఎస్‌ఆర్‌పీ జవాన్లతో సహా అన్ని పోలీసు అధికారులు, సిబ్బందికి త్వరలో బూస్టర్ డోస్ ఇవ్వబడుతుంది." అని డీసీపీ హర్షద్ పటేల్ తెలిపారు. గుజరాత్‌లో సోమవారం 12,753 కోవిడ్-19 కేసులు వెలుగు చూశాయి. ఇది గత ఏడాది మే 7 నుండి మొదటిసారిగా 12,000 దాటింది. రాష్ట్రంలో ఇప్పుడు కేసుల సంఖ్య 9,38,993గా ఉండగా, సూరత్‌లో ముగ్గురు, అహ్మదాబాద్, పంచమహల్స్‌లో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు మరణించారు. మృతుల సంఖ్య 10,164కి పెరిగింది.