ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. 100 విమానాలు ఆలస్యం

దేశ రాజధాని ఢిల్లీని శనివారం ఉదయం భారీ వర్షం అతలాకుతలం చేసింది.

By Knakam Karthik
Published on : 9 Aug 2025 8:49 AM IST

National News, Delhi, Heavy Rains, Flights Delayed

ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. 100 విమానాలు ఆలస్యం

దేశ రాజధాని ఢిల్లీని శనివారం ఉదయం భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానకు నగరం తడిసి ముద్దయింది. పలు ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ అంతటా రెడ్ అలర్ట్ జారీ చేసింది . తూర్పు, మధ్య ఢిల్లీలో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రోజంతా మోస్తరు నుండి భారీ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది.

భారీ వర్షాల ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు సగటున 15 నిమిషాలు, నగరానికి వచ్చే విమానాలు 5 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఫ్లైట్‌రాడార్ వెల్లడించింది. అయితే, విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ప్రయాణికులు తమ విమాన సర్వీసుల సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ విమానాశ్రయ అధికారులు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇండిగో, స్పైస్‌జెట్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు జారీ చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోందని, విమానాశ్రయానికి వచ్చేవారు అదనపు సమయం కేటాయించుకోవాలని ఇండిగో సూచించింది. వాతావరణ పరిస్థితుల వల్ల విమానాల రాకపోకలపై ప్రభావం పడవచ్చని, ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలని స్పైస్‌జెట్ కోరింది.

Next Story