ఒక పామును చూస్తేనే మనం షాక్ అవుతూ ఉంటాం. టెన్షన్ తో ఏమి చేయాలో తెలియని పరిస్థితి నెలకొంటూ ఉంటుంది. కానీ ఓ ఇంట్లో పదుల సంఖ్యలో పాములు కనిపించాయి. అది కూడా ఎంతో విషపూరితమైనవి. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లోని ఓ ఇంటిలో విషపూరిత నాగుపాములు కనిపించిన విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.
ఓ మట్టి కుండలో నాగుపాములు కనిపించాయని స్థానిక మీడియా పేర్కొంది. ఈ పాములు విషపూరితమైనవి. మట్టి కుండలో నుంచి ఒక్కసారిగా ప్రాణాంతక పాములు రావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ ఘటన ఆలాపూర్ ప్రాంతంలోని మదువానా గ్రామంలో చోటుచేసుకుంది.
మదువానాలోని ఓ ఇంట్లో ఓ పాత మట్టి కుండ ఉంది. దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం నాడు ఆ కుండను చూడగానే కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అందులో ఏకంగా పాముల గుంపే ఉంది. ఈ వార్త తెలుసుకుని చుట్టుపక్కల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటవీ శాఖకు సమాచారం అందించగా, పాములను రక్షించేందుకు ఆ శాఖకు చెందిన బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించారు. అడవిలోకి ఆ పాములను విడిచిపెట్టనున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇంకా విషపూరితమైన పాములు ఉన్నాయేమోనని వెతుకుతున్నారు.