'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్‌పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు
By Knakam Karthik
'ఆపరేషన్ సింధూర్' ఎఫెక్ట్: 18 ఎయిర్‌పోర్టులు మూసివేత..200 విమానాలు రద్దు
ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పీవోకే, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో క్షిపణి దాడులు చేపట్టిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొత్తం 200 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఆంక్షల నేపథ్యంలో 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, అకాసా ఎయిర్ వంటి అనేక విమానయాన సంస్థలు, మరికొన్ని విదేశీ విమానయాన సంస్థలు వివిధ ఎయిర్‌పోర్టుల నుంచి తమ సేవలను రద్దు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. మే 10వ తేదీ వరకు 165కు పైగా విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్‌సర్, బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, జోధ్‌పుర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్, శ్రీనగర్ సహా పలు ఎయిర్‌పోర్టుల నుంచి మే 10వ తేదీ ఉదయం 5.30 గంటల వరకు 165కి పైగా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం’’ అని ఇండిగో ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను చూసుకోవాలని తెలిపింది. ఆయా విమాన ప్రయాణికులు రీషెడ్యూల్ లేదా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేవని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ కూడా ఇస్తామని పేర్కొంది.
దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న 18 ఎయిర్‌పోర్టులు తాత్కాలికంగా మూతబడ్డాయి. అందులో శ్రీనగర్, లేహ్, జమ్మూ, అమృత్సర్, పఠాన్‌కోట్, చండీగఢ్, జోధ్‌పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్, రాజ్‌కోట్, భుజ్, జామ్‌నగర్, బికనీర్ విమానాశ్రయాలు ఉన్నాయి. ఇక ఎయిరిండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ స్టేషన్లకు వెళ్లే ఫ్లైట్లను మే 10 వరకు రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి అధికారికంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే సర్వీసులను రద్దు చేసినట్లుగా ఆయన విమానయన సంస్థలు పేర్కొన్నాయి.