ఆపరేషన్ ఫోకస్ లాంఛ్ చేసిన కేరళ ప్రభుత్వం.. జాగ్రత్త
Operation Focus launched in Kerala. కొన్ని వాహనాల ముందు ఉండే హెడ్ లైట్లు ఎంతో చికాకు తెప్పిస్తూ ఉంటాయి.
By Medi Samrat Published on 6 April 2022 4:58 PM ISTకొన్ని వాహనాల ముందు ఉండే హెడ్ లైట్లు ఎంతో చికాకు తెప్పిస్తూ ఉంటాయి. ఊహించని విధంగా ఎదురుగా వస్తున్న వాహనదారులకు ఇబ్బంది పెట్టే లైట్లను కొందరు తమ తమ వాహనాల ముందు ఉంచుతూ ఉంటారు. అయితే ఇకపై అలాంటివి లేకుండా చేయాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అనధికార రంగు లైట్లను ఉపయోగించడం, హై బీమ్‌ను డిమ్ చేయకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వాహన యజమానులు, డ్రైవర్లను ట్రాక్ చేయడానికి కేరళలోని మోటారు వాహనాల విభాగం (MVD) సోమవారం నుండి 10 రోజుల రాష్ట్రవ్యాప్త డ్రైవ్ 'ఆపరేషన్ ఫోకస్'ను ప్రారంభించింది. మూడు రోజుల క్రితం గోవాలోని కన్నూర్ నుంచి వచ్చిన టూరిస్ట్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు. బస్సు ఆపరేటర్ అదనపు లైట్లను అమర్చడానికి ఒరిజినల్ విద్యుత్ వైరింగ్, ఫిట్టింగ్‌లను మార్చడం వల్ల మంటలు సంభవించినట్లు తేలింది.
మోటారు వాహనాల విభాగం ఏప్రిల్ 5, 8 మరియు 12 తేదీలలో రాత్రి 7 గంటల నుండి.. ఉదయం 3 గంటల వరకూ తనిఖీని నిర్వహిస్తుంది. ఈ తనిఖీలో పార్కింగ్ లైట్లు లేకపోవడం, రిజిస్ట్రేషన్ గుర్తు, వెనుక నంబర్ ప్లేట్‌లో వెలుతురు లేకపోవడం, శబ్దం, వాయు కాలుష్యం, అనధికారికంగా లైట్లను అమర్చడం వంటివి కూడా పరిగణించబడతాయి. అదనపు లైట్లను ఉపయోగించినా కూడా చర్యలు తీసుకోనున్నారు. కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ (CCOA) అనధికార లైట్లు, ఫిట్టింగ్‌లను ఉపయోగించకుండా సభ్యులను కోరింది. యువతను వాహనాల వైపు ఆకర్షిస్తూ లైట్లను ఎక్కువగా మారుస్తున్నారు. ఇలాంటి ధోరణులను మానుకోవాలని సీసీఓఏ ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రశాంతన్ అన్నారు. కొన్ని ప్రమాదాలకు ఫ్యాన్సీ లైట్లే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వెలుగుతున్న లైట్లు వాహనదారులకు కంటి మీద తీవ్ర ప్రభావం చూపడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.