రెండు డోస్ ల వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లకు మాత్రమే సినిమా థియేటర్లలోకి అనుమతి
Only Fully Vaccinated Allowed In Malls and Theatres in Karnataka. భారతదేశంలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా మహారాష్ట్రలో
By Medi Samrat Published on 3 Dec 2021 7:32 PM ISTభారతదేశంలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా మహారాష్ట్రలో 28, ఢిల్లీలో 12 అనుమానిత కేసులను గుర్తించారు. వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స చేస్తున్నారు. మహారాష్ట్రలో గుర్తించిన అనుమానిత కేసుల్లో 10 మంది ముంబైకి చెందిన వారేనని అధికారులు చెప్పారు. ఢిల్లీలో 12 అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించి రెండు కేసులు కనుగొనబడిన తర్వాత, సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం కొత్త కోవిడ్ -19 మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. అన్ని విద్యాసంస్థల్లో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు/ఫెస్ట్‌లు, ఫంక్షన్‌లు జనవరి 15, 2022 వరకు వాయిదా వేయబడ్డాయి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు కోవిడ్-19 వ్యాక్సిన్ యొక్క రెండు డోస్‌లతో టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. మాల్స్, సినిమా హాళ్లు, థియేటర్లలోకి పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అన్ని సమావేశాల కోసం అనుమతించబడిన హాజరు 500కి పరిమితం చేయబడింది. కోవిడ్ నిబంధనల విషయంలో నిర్వాహకులు బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 టీకా యొక్క రెండు డోసులతో టీకాలు వేయించుకోవాలని సూచించారు.
దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకిపోయింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు భారత్ లో సైతం వెలుగుచూశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలో రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు పేర్కొంది. 44 ఏళ్లు, 66 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించినట్టు తెలిపింది. వీరిద్దరూ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) రికార్డుల ప్రకారం ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఆ డాక్టర్ కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని తెలుస్తోంది. ఎక్కడికెళ్లకుండానే ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు.