జనవరి 10 నుంచి జనవరి 31 వరకు చెన్నై లోకల్ రైళ్లలో డబుల్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉన్నవారిని మాత్రమే ప్రయాణించేందుకు అనుమతిస్తామని దక్షిణ రైల్వే ఈరోజు ప్రకటించింది. సర్టిఫికేట్ లేని ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేయలేరని, ఓమిక్రాన్ వేవ్ కారణంగా కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో దక్షిణ రైల్వే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎటువంటి మినహాయింపు ఉండదని, సీజన్ టిక్కెట్ హోల్డర్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది పేర్కొంది. టీకా మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారికి ఈ కొత్త మార్గదర్శకానికి ముందు సీజన్ టిక్కెట్లు జారీ చేయబడినట్లయితే, ఈ ప్రయాణికులు ఇప్పుడు రెండవ డోస్ టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణించడానికి అనుమతించబడతారని తెలిపింది. ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరాన్ని నిర్వహించడం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం వంటి భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ప్రయాణికులకు సూచించింది.
తమిళనాడులో శుక్రవారం 8,981 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరులో అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర రాజధానిలో 4,531 కేసులు వెలుగు చూశాయి. తమిళనాడులో ఇప్పటివరకు 117 రికవరీలతో సహా కోవిడ్-19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్ 121 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం ఎనిమిది మంది కోవిడ్‌తో మరణించారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 36,833కి చేరుకుంది. గత 24 గంటల్లో 984 మంది ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 27,08,763కి చేరింది.