పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సాగు చట్టాలు రద్దు చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీతో పాటు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. భారీ బ్యానర్ పట్టుకుని పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు. మరోవైపు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన రద్దు బిల్లును రూపొందించింది. దీనికి కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందితే కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు అవుతాయి.
ప్రారంభమైన తొలి రోజే పార్లమెంట్‌లో రసభ జరిగింది. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ ప్రారంభం తర్వాత కొత్త సభ్యుల చేత స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం స్వీకారం చేయించారు. లోక్‌సభ పోడియం దగ్గరకు వెళ్లి విపక్షాలు నినాదాలు చేయడంతో స్పీకర్ ఓం బిర్లా.. లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవి అని అన్నారు. దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని పేర్కొన్నారు. ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించాల్సి అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రతి విషయం చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్త సంకల్పంతో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.