‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది

By Medi Samrat  Published on  12 Dec 2024 3:58 PM IST
‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఆమోదం

దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ‘ఒకే దేశం ఒకే ఎన్నికల’ బిల్లుకు మోదీ మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం వచ్చే వారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. దీనిపై రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ రూపొందించిన నివేదికకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మోదీ ప్రభుత్వం వచ్చే వారం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవ‌కాశం ఉంది. వార్తా సంస్థ ANI ప్రకారం.. మోదీ మంత్రివర్గం ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుపై ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని కోరుతోంది. బిల్లుపై సమగ్ర చర్చ కోసం ప్రభుత్వం దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లేదా జేపీసీకి పంపవచ్చు.

100 రోజుల్లో పట్టణ, పంచాయతీ ఎన్నికలతోపాటు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.

భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' చొరవపై కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయం తీసుకురావాల‌ని అన్నారు. ఈ అంశం రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉందని.. యావత్ దేశానికి మంచి చేస్తుందని ఆయన ఉద్ఘాటించారు.

‘‘కేంద్ర ప్రభుత్వం ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుందని.. ఈ అంశం ఏ పార్టీకి సంబంధించినది కాదని.. యావత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే అంశం. ఇది పెద్ద మార్పును తెస్తుంది, ఇది నా అభిప్రాయం కాదు, ఆర్థికవేత్తల అభిప్రాయం.. దీని అమలు తర్వాత దేశ జిడిపి 1 నుండి 1.5 శాతం పెరుగుతుందని నమ్ముతున్నార‌న్నారు.

Next Story