ఆ ఎలక్ట్రిక్ బైక్ లు అన్నీ వెనక్కు..

Ola To Recall Over 1,400 Electric Scooters Amid Rise In Fire Incidents. దేశంలో ఎలక్ట్రిక్ బైక్ ల పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. బ్యాటరీల నాణ్యత, ఇత‌ర కారణాలు

By Medi Samrat  Published on  24 April 2022 8:30 PM IST
ఆ ఎలక్ట్రిక్ బైక్ లు అన్నీ వెనక్కు..

దేశంలో ఎలక్ట్రిక్ బైక్ ల పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. బ్యాటరీల నాణ్యత, ఇత‌ర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఓలా ఎల‌క్ట్రిక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పూణెలో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైక్‌ల‌ను రీకాల్ (వెన‌క్కి పిలిపించ‌డం) చేస్తున్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌ల‌ ప్ర‌మాదానికి గురైన ఈ-స్కూట‌ర్ తో పాటు ఆ బ్యాచ్‌లో తయార‌యిన అన్ని బైక్‌ల‌నూ ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఓలా తెలిపింది. అందుకే ఆ బైక్‌ల‌ను వెన‌క్కి పిలిపిస్తున్న‌ట్లు వివ‌రించింది. ఆ స్కూట‌ర్ల‌లోని బ్యాట‌రీలు, థ‌ర్మ‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌మ స‌ర్వీస్ ఇంజ‌నీర్లు స‌మీక్ష నిర్వ‌హిస్తార‌ని, భార‌త బ్యాట‌రీ ప్ర‌మాణాలతో పాటు ఐరోపా ప్ర‌మాణాల‌కు కూడా త‌మ స్కూట‌ర్ల‌లో అమ‌ర్చిన బ్యాట‌రీలు స‌రిపోతాయ‌ని తెలిపింది.

మనుషుల ప్రాణాలను తీస్తున్న విద్యుత్ బైకుల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బైకుల తయారీలో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు జరిమానాలు వేస్తామని కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.

తాజాగా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అలాంటి చర్యలను తీసుకుంటే మంచిదేనని.. తమ సంస్థ తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ బైకులు నాణ్యమైనవని చెప్పారు. తమ స్కూటర్లలో సమస్యలు రావడం చాలా అరుదన్నారు. ఎలక్ట్రిక్ బైకులుగానీ, పెట్రోల్ తో నడిచే బైకులకుగానీ ప్రమాదాలు జరగడం సహజమని అన్నారు. ''ప్రపంచంలో టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు ప్రమాదం జరగలేదా? హ్యూందాయ్, జీఎం వంటి కంపెనీల కార్లకూ ప్రమాదాలు జరిగాయి కదా'' అని అన్నారు. చేయాల్సిందల్లా ప్రమాణాలను మెరుగుపరచుకోవడమేనని, నాణ్యతా చెకింగ్ లను పటిష్ఠంగా చేయాలని అన్నారు. తమ స్కూటర్లలో అసలు సమస్యలే లేవని అనట్లేదని, అయితే, సమస్యలు అరుదని, సాఫ్ట్ వేర్ కు సంబంధించిన సమస్యలే ఉన్నాయని స్పష్టం చేశారు. ఓలా స్కూటర్ కాలిపోయిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. దానికి సంబంధించిన నివేదిక అందాల్సి ఉందన్నారు.

Next Story