ఒక కస్టమర్ తన కొత్త ఓలా స్కూటర్ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సర్వీస్ సెంటర్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడం, సర్వీస్‌తో సమస్యలను ఎదుర్కొన్నందుకు ఏకంగా షో రూమ్ కు నిప్పుపెట్టాడు. కర్ణాటక రాష్ట్రం కలబురగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. షోరూం యజమానితో వాగ్వాదం జరగడంతో కోపం తెచ్చుకున్న కస్టమర్ ఏకంగా షోరూమ్‌కు నిప్పంటించాడు. నిందితుడిపై కలబురగి చౌక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిందితుడు 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ ని అరెస్టు చేశామని, ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నదీమ్ తన ఓలా బైక్ రిపేర్‌కు రావడంతో సర్వీస్ సెంటర్‌లో ఆగస్టు 28న సర్వీస్ కోసం ఇచ్చాడు. సెంటర్ నుంచి తన బైక్ డెలివరీ తీసుకొని నడుపుతున్నప్పటికీ పదే పదే అదే సమస్య తలెత్తుతుండడంతో నదీమ్ విసిగిపోయాడు. తన సమస్యను షోరూమ్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో విసిగిపోయాడు. స్వయంగా మెకానిక్ అయిన నదీమ్ ఈ విషయంపై ఎన్నోసార్లు ఓలా సర్వీస్ సెంటర్ కు వచ్చి వెళ్ళాడు. ఇక మరోసారి కూడా తన బైక్ లో సమస్యలు రావడంతో ఓలా షోరూంకు సమీపంలోనే ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ ను కొనుగోలు చేసిన నదీమ్.. నేరుగా ఓలా షోరూంకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో అందులోని కొత్త స్కూటర్లు అన్ని కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 6 ఈవీ స్కూటర్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి.