గుజరాత్‌లో కోవిడ్-19 కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో నవంబర్ 22(రేపు) నుండి 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. దీంతో.. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెంది.. ఆంక్షలు విధించిన తర్వాత 1 నుండి 5 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరుకావడం ఇదే మొదటిసారి. ఈ విషయమై ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జితు వఘాని మాట్లాడుతూ.. దీపావళి సెలవులు ఆదివారంతో ముగిస్తున్న నేఫథ్యంలో 22న 1 నుంచి 5 తరగతులకు ఆఫ్‌లైన్ బోధన తిరిగి ప్రారంభమవుతుంది తెలిపారు. అయితే పిల్లలను పాఠశాలలకు పంపాలన్నది తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేసామని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. సెప్టెంబర్ 2న గుజరాత్‌లో 6 నుంచి 8 తరగతుల విద్యార్ధులకు ఆఫ్‌లైన్ తరగతులు 50 శాతం సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి. ఆఫ్‌లైన్ తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులను కూడా కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే విద్యార్థుల హాజరును ఐచ్ఛికంగా ఉంచింది. జూలై ప్రారంభంలో కొత్త కరోనావైరస్ కేసులలో గణనీయమైన తగ్గుదల దృష్ట్యా 12వ తరగతి పాఠశాలలు, కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇదిలావుంటే.. గుజరాత్‌లో శనివారం 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,27,184కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం 323 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.