ఒడిశా రైలు విషాదం: ఘటనా స్థలానికి రైల్వే మినిస్టర్‌ అశ్విని వైష్ణవ్‌

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 233 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన రైలు పట్టాలు తప్పిన సంఘటన స్థలానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని

By అంజి  Published on  3 Jun 2023 10:41 AM IST
Odisha, train accident, Union Railways Minister, National news

ఒడిశా రైలు విషాదం: ఘటనా స్థలానికి రైల్వే మినిస్టర్‌ అశ్విని వైష్ణవ్‌

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 233 మంది ప్రాణాలను బలిగొన్న విషాదకరమైన రైలు పట్టాలు తప్పిన సంఘటన స్థలానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద స్థలంలో వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ.. ''మా ప్రధాన దృష్టి గాయపడిన వ్యక్తులను రక్షించడం. సరైన చికిత్స చేయడం. ప్రయాణీకుల సరైన సమాచారాన్ని వారి బంధువులకు చేరవేయడం'' అని చెప్పారు. జిల్లా యంత్రాంగం నుండి అనుమతి పొందిన తర్వాత పునరుద్ధరణ ప్రారంభమవుతుంది. పునరుద్ధరణ పనులకు అవసరమైన అన్ని యంత్రాలు బాలాసోర్‌లోని సోరోలో సిద్ధంగా ఉంచబడ్డాయి.

గత 15 ఏళ్లలో దేశం చూసిన అత్యంత ఘోరమైన ప్రమాదంలో ఒకటిగా పరిగణించబడుతున్న ఈ ప్రమాదంపై సమగ్ర ఉన్నత స్థాయి విచారణ నిర్వహించబడుతుందని, రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణను కూడా నిర్వహిస్తారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలియజేశారు. 900 మందికి పైగా గాయపడిన ఈ భారీ ప్రమాదం వెనుక గల కారణాన్ని అడిగితే, "విచారణ పూర్తయిన తర్వాతే కారణం కనుగొనబడుతుంది" అని ఆయన అన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను చేపట్టారు. ఆయన ఒకరోజు సంతాప దినం ప్రకటించారు. “బహనాగా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం నవీన్ పట్నాయక్ ఒక రోజు రాష్ట్ర సంతాప దినం కోసం ఆదేశించారు. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా జూన్ 3వ తేదీన రాష్ట్ర వేడుకలు జరగవు’’ అని ఒడిశా సమాచార పౌరసంబంధాల శాఖ తెలిపింది.

రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, SMVT-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో బోల్తా పడిన 17 కోచ్‌లను ఇంకా ఎవరైనా కోచ్‌ల కింద చిక్కుకుపోయారో లేదో తెలుసుకోవడానికి వాటిని తొలగిస్తున్నారు.

Next Story