రైల్వే విభాగం రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు ప్రత్యేక కవచ్ వ్యవస్థను డెవలప్ చేసింది. శుక్రవారం ఒడిశాలో జరిగిన భీకర రైలు ప్రమాదంలో 200 మందికి పైగా మరణించారు. మూడు రైళ్లు ఢీకొన్న సమయంలో కవచ్ వ్యవస్థ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ రూట్లో యాంటీ కొలిజన్ వ్యవస్థ అయిన కవచ్ సిస్టమ్ లేదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని, ఇక రైల్వే లైన్ పునరుద్దరణ పనులు మొదలుపెడుతున్నామని, ప్రమాదం జరిగిన రూట్లో కవచ్ రక్షణ వ్యవస్థ లేదని భారతీయ రైల్వే శాఖ ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. బాలాసోర్ వద్ద జరిగిన ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం ఇంకా స్పష్టం కాలేదు.
ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒడిశా వెళ్లాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. కటక్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.