గున్న ఏనుగుతో సెల్ఫీలు.. తల్లి ఏనుగు కు ఆగ్రహం
Odisha Man Attacked Elephant Youth Clicks Selfie Baby Elephant. వన్య ప్రాణుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
By Medi Samrat
వన్య ప్రాణుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏమీ అనడం లేదు.. ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదని సైలెంట్ గా ఉంటే మాత్రం ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏనుగులు క్షణాల వ్యవధిలో పై నుండి కిందకు ఎత్తి పడేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఘటనలలో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. గున్న ఏనుగుతో సెల్ఫీ తీసుకుంటూ ఉన్న ప్రజల మీదకు తల్లి ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో.. వాళ్ళతో ఏ సంబంధం లేని యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సుర్లా– స్వర్ణాపురం తీరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏనుగుదాడిలో ఒడిశాకు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడురోజులుగా ఉన్న ఏనుగుల గుంపు మంగళవారం ఒడిశా రాష్ట్రానికి చేరుకుంది. సుర్లా–స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది. విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ పిల్ల ఏనుగుతో సెల్ఫీలు దిగుతూ కనిపించారు. తన బిడ్డను ఏమో చేస్తున్నారని భావించిన తల్లి ఏనుగు మాత్రం కోపంగా వెనక్కి వచ్చింది. ఆ యువకులు కాస్తా పరుగులు తీశారు. నదిలో చేపలు పడుతున్న ఒడిశా యువకుడు ఏనుగు రాకను గమనించలేదు. అక్కడే ఉన్న అతడి మీద ఏనుగు దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడ్డంతో ఆస్పత్రికి తరలించారు.