ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నబా కిషోర్ దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాల్పులు జరిపాడు. దాస్ ఛాతీకి బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయనను ఝార్సుగూడ ఎయిర్‌పోర్టుకు తరలించి అక్కడి నుంచి భువనేశ్వర్‌కి తరలించనున్నారు. తదుపరి చికిత్స నిమిత్తం ఆరోగ్య మంత్రిని అపోలో ఆసుపత్రికి తరలించనున్నారు.
వీడియో పుటేజీలో గాయపడిన మంత్రిని పైకి లేపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా దాస్ ఛాతీ నుండి రక్తస్రావం అవడం కనిపించింది. ఆ సమయంలో మంత్రి అపస్మారక స్థితిలో ఉన్నారు. గాంధీ చౌరస్తాలో మంత్రి తన కారులోంచి దిగగానే కనీసం నాలుగైదు బుల్లెట్లను పోలీసు కాల్చాడు. నిందితుడు ఏఎస్సైని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని బ్రజరాజ్‌నగర్‌లో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన పోలీసును ఏఎస్సై గోపాల్ దాస్‌గా గుర్తించారు. కాల్పుల వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
ఈరోజు జరిగే కార్యక్రమం భద్రతా ఏర్పాట్లను చూసేందుకు ఏఎస్ఐ ని డ్యూటీలో ఉంచారు అధికారులు.మంత్రిపై కాల్పులు జరుపుతున్న సమయంలో ఆయనకు సమీపంలోనే ఉన్నాడు ఏఎస్ఐ. "అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ASI) గోపాల్ దాస్ మంత్రిపై కాల్పులు జరిపారు. మంత్రి గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు" అని బ్రజ్‌రాజ్‌నగర్ SDPO గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు. గోపాల్ దాస్ తన రివాల్వర్ తో మంత్రి నబా దాస్‌పై కాల్పులు జరిపాడని భోయ్ తెలియజేశారు. కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టంగా లేదు. ప్రస్తుతం ఏఎస్‌ఐని విచారిస్తున్నామని, సమగ్ర విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని భోయ్ చెప్పారు.