ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓమిక్రాన్ వ్యాప్తి నేఫథ్యంలో డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు ఆంక్షలు ప్రకటించింది. ఈ మేరకు క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. క్రిస్మస్ సందర్భంగా చర్చి లోపలికి గరిష్టంగా 50 మందిని అనుమతించాలని ఆదేశాలు జారీచేసింది. ఎలాంటి సామాజిక సమావేశాలు, ర్యాలీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అనుమతించబడవని పేర్కొంది. రాష్ట్రంలో పెళ్లి తప్ప మరే వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
సామూహిక విందు కార్యక్రమాలకు కూడా అనుమతి లేదంటూ నిబంధనలు కఠినతరం చేసింది ప్రభుత్వం. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియల ఆచారాలు అనుమతించబడతాయని పేర్కొంది. ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. పాజిటివ్ గా నిర్ధారణ అయిన రోగులందరూ విదేశాల నుండి తిరిగి వచ్చినవారే కావడం గమనార్హం. ఇదిలావుంటే.. భారతదేశంలో గత 24 గంటల్లో 122 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 358కి చేరుకుంది. వీరిలో 114 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.
ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రం రాత్రి కర్ఫ్యూపై ప్రకటన చేయగా.. ఉత్తరప్రదేశ్ కూడా రాత్రి కర్ఫ్యూ విధించింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 25(శనివారం) నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుందని.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అది కొనసాగునున్నట్లు చెప్పింది.