తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ కు మగబిడ్డ.. శుభాకాంక్షలు చెప్పిన మాజీ భర్త
Nusrat Jahan welcomed her first son. బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు
By Medi Samrat Published on 26 Aug 2021 11:55 AM GMT
బెంగాలీ సినీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు కోల్‌కతాలోని నియోతియా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. బెంగాలీ నటుడు యష్ దాస్‌గుప్తా ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. డెలివరీ సమయంలోనూ అతడు అక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం కూడా ఆమె హాస్పిటల్ నుంచి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏడాది మొదట్లో నిఖిల్‌తో తన పెళ్లి ఇండియన్ చట్టాల ప్రకారం చెల్లదని నుస్రత్ ప్రకటించింది. అంతేకాదు తనకు సంబంధించిన నగలు, వస్తువులను నిఖిల్ అక్రమంగా తన దగ్గరే పెట్టుకున్నాడని, తన అకౌంట్లలోని డబ్బును కూడా తనకు తెలియకుండా వాడుకున్నాడని ఒక ప్రకటనలో ఆమె ఆరోపించారు. గతేడాది నవంబర్ నుంచి ఈ జంట విడిగా ఉంటున్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నా.. తల్లీ బిడ్డలిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు మాజీ భర్త నిఖిల్. బాబుకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు నిఖిల్.