ఇప్పుడు మన దేశం అప్పు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల బెడతారు. ఎందుకంటే సంక్షేమం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేశారు. గత 70 ఏళ్లలో భారతదేశ అప్పు ఏకంగా 5.29 లక్షల శాతం పెరిగింది. 1950-51 సంవత్సరంలో భారత్ నికర అప్పుడు రూ.2,565.40 కోట్లుగా ఉంది. అయితే నేటికి అంటే 2021 - 22 వరకు అప్పు రూ.1,35,86,975.52 కోట్లకు చేరింది. సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవి కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 2014-15 సంవత్సరం నాటికి భారత్ నికర అప్పు రూ.62,42,220.92 కోట్లు ఉంది. అయితే అది గడిచిన ఏడు సంవత్సరాల్లో 117 శాతం పెరిగింది.
అంటే 2021 -22 బడ్జెట్ నాటికి అక్షరాల రూ.1,35,86,975.52 కోట్లకు పెరిగింది. 2014-15కు ముందు దేశం అప్పు రూ.62.42 లక్షల కోట్ల మేర ఉంది. కాగా కొత్తగా గత ఏడు సంవత్సరాల్లో రూ.73,44,754 కోట్ల అప్పులు చేసినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. 1950-51లో విదేశీ రుణం రూ.32.03 కోట్లు, దేశ అంతర్గత అప్పు రూ.2,022.30 కోట్లు ఉంది. అది 2021 -22 నాటికి విదేశీ అప్పు రూ.4,27,925.24 కోట్లు, దేశ అంతర్గత అప్పు రూ.1,13,57,415 కోట్లకు పెరిగింది. 70 ఏళ్ల కిందట చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఎరువుల కంపెనీలు, ఎఫ్‌సీఐకి రాయితీ కింద చెల్లించాల్సిన అప్పులు లేవు. కానీ ఇప్పుడు ఆ రాయితీల భారం రూ.1,62,827.90 కోట్లకు పెరిగింది.