ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష బీభత్సం.. రెండు రోజుల్లో 30 మంది మృతి
ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లో 30 మంది చనిపోయారు.
By - Medi Samrat |
ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లో 30 మంది చనిపోయారు. జూన్ 1న కూడా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా 14 మంది మృతి చెందినట్లు సమాచారం. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం మరియు మణిపూర్‌లు కొండచరియలు విరిగిపడటం, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అస్సాంలోని 12 జిల్లాల్లో కనీసం 60 వేల మంది ప్రభావితమయ్యారు.
అస్సాంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 8 మంది మరణించారు. అరుణాచల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 9 మంది మరణించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కమెంగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై నుంచి కారు కొట్టుకుపోవడంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు మృతి చెందారు.
వాతావరణ శాఖ అస్సాంలోని కొన్ని ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు.. మిగిలిన ఈశాన్య ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. గత 24 గంటల్లో అసోంలో కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 8 మంది చనిపోయారు. దీనితో పాటు ఆరు జిల్లాల్లో వరదలు వచ్చాయి.. వీటి కారణంగా 10 వేల మంది ప్రభావితమయ్యారు.
మొత్తం ఐదు మరణాలు కమ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలోనే సంభవించాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) తెలిపింది. గౌహతి శివార్లలోని బోండాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు రాష్ట్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి జయంత్ మల్లా బారువా తెలిపారు. గౌహతిలో ఒక రోజులో 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. బ్రహ్మపుత్ర సహా ఈశాన్య నదుల నీటిమట్టం కూడా గణనీయంగా పెరిగింది.