సోషల్ మీడియాలో "ఆత్మహత్య" చేసుకోబోతున్నా అనే పోస్ట్‌ను చూసి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరా ఆ విద్యార్థిని రక్షించడానికి వెళ్లగా.. అదొక ప్రాంక్ అని తెలిసిందని అధికారులు శుక్రవారం తెలిపారు. గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా సెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో 10వ తరగతి విద్యార్థి అప్లోడ్ చేసిన "ఆత్మహత్య వీడియో"ని చూసింది. బాలుడి లొకేషన్ కనుగొనడానికి ఇన్‌స్టాగ్రామ్ మాతృ సంస్థ మెటా నుండి సహాయం తీసుకుంది. తీరా పోలీసులు అక్కడికి వెళ్లగా అదొక ప్రాంక్ వీడియో అని తెలిసిందని పోలీసులు స్పష్టం చేశారు. ఏప్రిల్ 26న తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ నోయిడా) రాజీవ్ దీక్షిత్ తెలిపారు.
ఒక బాలుడు ఆత్మహత్యకు సంబంధించిన వీడియోను పెట్టడంపై స్థానిక ఫేజ్ 2 పోలీస్ స్టేషన్ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమాచారం అందించిందని దీక్షిత్ చెప్పారు. మెటా సహకారంతో అతడు ఉంటున్న లొకేషన్ ను కూడా గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాలుడిని గుర్తించారు. బాలుడు ఆల్ అవుట్ లిక్విడ్‌ను తాగుతున్నట్లు వీడియోను పోస్ట్ చేశాడు. వాస్తవానికి అతను ఖాళీ ఆల్ అవుట్ బాటిల్ లో నీటిని వేసుకుని తాగినట్లు తేలిందని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు బాలుడితో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ పొందడం కోసం తాను ఇలా చేశానని చెప్పాడని దీక్షిత్ చెప్పారు. నిబంధనల ప్రకారం బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. బాలుడికి కౌన్సెలింగ్‌ను కొనసాగించాలని అతని కుటుంబ సభ్యులను కోరినట్లు ఆయన తెలిపారు.