అగ్నిపథ్ విషయంలో వెనక్కు తగ్గని కేంద్రం
No rollback of Agnipath scheme, says military. అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
By Medi Samrat
అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్ ఉంటుందని.. సాధారణ రిక్రూట్ మెంట్ లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పై యువతకు రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది. యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని.. అందుకు సంబంధించి త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అని సైనిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ అనిల్ పురి అన్నారు. విధ్వంసాలకు పాల్పడినవారికి ఆర్మీలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు. సైనిక ఉద్యోగాల కోసం 70 శాతం గ్రామాల నుంచే వస్తారని.. యువతను రెచ్చగొట్టడం వల్ల ఆందోళనలు జరిగాయని చెప్పారు. అగ్నివీర్ ల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందన్నారు. ఆందోళనల్లో పాల్గొనలేదని అండర్ టేకింగ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచించారు.
అగ్రిపథ్‌పై రేకెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు భారత త్రివిధ దళాధిపతులు ఆదివారం మీడియా ముందుకు వచ్చారు. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో భేటీ అనంతరం వారు మాట్లాడుతూ అగ్నిపథ్ పథకానికి సంబంధించి పలు కీలక అంశాలను ప్రకటించారు. విధి నిర్వహణలో 'అగ్నివీర్' మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. అగ్నిపథ్ పై ఏకంగా రెండేళ్ల పాటు అధ్యయనం చేశాకే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అనుభవానికి, యువశక్తికి ప్రాధాన్యం ఇస్తూ ఈ పథకానికి రూపకల్పన చేశామని వెల్లడించారు. సైన్యంలో సగటు వయసు తగ్గించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నామని త్రివిధ దళాధిపతులు తెలిపారు. భారత సైన్యంలో ఏటా 17,600 మంది రిటైర్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. అగ్నివీర్‌లకు ఇచ్చే అలవెన్సుల్లో ఎలాంటి తేడాలు ఉండవని.. సర్వీసు నిబంధనల్లోనూ వివక్ష ఉండదని తెలిపారు.