మద్యపాన నిషేధం కాదు.. డ్యాన్స్ బార్లు మాత్ర‌మే బంద్ చేస్తున్నాం

గుజరాత్, బీహార్‌లో సమస్యల నేప‌థ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని ఒడిశా న్యాయ శాఖ‌ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ధృవీకరించారు

By Medi Samrat  Published on  2 Sep 2024 9:53 AM GMT
మద్యపాన నిషేధం కాదు.. డ్యాన్స్ బార్లు మాత్ర‌మే బంద్ చేస్తున్నాం

గుజరాత్, బీహార్‌లో సమస్యల నేప‌థ్యంలో రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని ఒడిశా న్యాయ శాఖ‌ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ధృవీకరించారు. మద్యం దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో సమతుల్య విధానాన్ని రూపొందించడం, కల్తీ మద్యం అమ్మకాలు నివారించడం, అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఊహాగానాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో ఒడిశాలో మద్యం నిషేధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. నిషేధాన్ని అమలు చేయడానికి ఎటువంటి చర్చలు లేదా ప్రణాళికలు రూపొందించ‌డం లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు.

గుజరాత్‌, బీహార్‌ల పరిస్థితిని పరిశీలిస్తే.. మద్యపాన నిషేధం తర్వాత ఒడిశా కూడా అవే సమస్యలను ఎదుర్కోవాలని కోరుకోవడం లేదని మంత్రి అన్నారు. నిషేధం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాదని.. అక్రమ విక్రయాలు పెరుగుతాయని.. దీనివల్ల ప్రజల మరణాలు మాత్రమే ఉంటాయ‌ని.. కాబట్టి పూర్తిగా నిషేధం కాకుండా చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు. మద్యం, మాదకద్రవ్యాలు మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒడిశా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా మద్యపాన నిషేధానికి బదులుగా రూ.100 కోట్లను ప్రకటించిందని మంత్రి వెల్ల‌డించారు. రాష్ట్ర ఆదాయంలో మద్యం వాటా దాదాపు 17-18 శాతం ఉందని.. అందుకే ప్రతి విషయాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ.. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. డ్యాన్స్ బార్‌లపై నిషేధం గురించి మంత్రి హరిచందన్‌ను ప్రశ్నించగా.. మద్యం మత్తులో అమ్మాయిలు డ్యాన్స్ చేయడం ఒడిశా సంస్కృతి కాదని.. అందుకే డ్యాన్స్ బార్‌లను నిషేధించాలని నిర్ణయించామని.. అయితే బార్‌లలో వాయిద్య సంగీతం, గాత్ర సంగీతానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

Next Story