ఈ విమానంలో ప్రయాణిస్తే ఏలాంటి ఆంక్షలు ఉండవు.. ఎందుకంటే.?
No isolation zone on aircraft operating int’l flights under 4 hours. దేశంలో కరోనా మహమ్మారి వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం
By Medi Samrat Published on 21 Dec 2020 7:45 PM IST
దేశంలో కరోనా మహమ్మారి వ్యాపించడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ లాక్ డౌన్ కారణంగా అన్ని రవాణా సంస్థలు కూడా ఆగిపోవడం మనకు తెలిసిన విషయమే. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రోడ్డు రవాణా సంస్థలతో పాటు విమానయాన సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది.అయితే విమానయాన సంస్థలకు కొన్ని నిబంధనలతో కూడిన అనుమతిని తెలిపింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ఇన్ని రోజులు విమానయాన సంస్థలు పని చేశాయి.
ప్రస్తుతం కరోనా కేసులు భారతదేశంలో చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమానాలకు సడలింపులు ఇవ్వాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ విజ్ఞప్తి చేయడంతో అందుకు కేంద్ర ప్రభుత్వం నాలుగు గంటల వ్యవధిలో ప్రయాణించే విమానాలలో ఇసొలేషన్ జోన్ ఆంక్షలను ఎత్తి వేసినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 16 నుంచి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్ కోసం కొన్ని సీట్లను ఖాళీగా విడిచిపెట్టాలన్న నిబంధన కూడా సవరించినట్లు తెలిపారు.
ప్రస్తుతం నాలుగు గంటల వ్యవధికి మించి ప్రయాణం చేస్తున్న విమానాలలో మాత్రమే చివరి వరుసలో కుడివైపు ఉన్న సీట్లను మాత్రమే క్వారంటైన్ కోసం ఉపయోగించాలని ఈ ఆదేశాలలో పేర్కొన్నారు. అంతేకాకుండా విమాన ప్రయాణంలో ఎవరికైనా కరోనా సంబంధిత లక్షణాలు కనిపిస్తే, వారికి అవసరమైన పీపీఈ కిట్లను కూడా విమాన సంస్థలే ప్రయాణికులకు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.మన దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ కూడా అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణికులు కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని విమానయాన శాఖ అధికారులు ప్రయాణికులకు సూచించారు.