కోవాగ్జిన్ పై ఢిల్లీ సర్కార్ కీలక ఆదేశాలు
No Covaxin For 1st Dose, 18+ Can Take Only 2nd Dose. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు
By Medi Samrat Published on 7 Jun 2021 12:07 PM ISTప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల విషయమై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. టీకాల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంది. వ్యాక్సిన్ల కొరత ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కోవాగ్జిన్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రెండో డోసు తీసుకోవాల్సిన 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి మాత్రమే కోవాగ్జిన్ ను ఇవ్వనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ నెల మొత్తం లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. ప్రయివేటు ఆసుపత్రులు సైతం తాజా నిబంధనలకు లోబడి టీకాలు ఇవ్వాలని పేర్కొన్నారు. 18-44 ఏళ్ల మధ్య వయసు వారికి మే 1 నుంచి దిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించగా.. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి 303 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ నెల రోజుల తర్వాత కొవాగ్జిన్ కొరత కారణంగా నిలిచిపోయింది. 45 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు ఒక రోజుకు సరిపడా డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొవిషీల్డ్ డోసులు మాత్రం మరో 28 రోజుల వరకు సరిపడా నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 368 ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు వేయడం రెండు వారాల వరకు పూర్తిగా నిలిపివేశారు.
కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఓ వ్యూహాన్ని పాటించాలని ఢిల్లీ హైకోర్టు గతవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యాక్సినేషన్ విధానంలో తేడాలు కనిపిస్తున్నాయంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది.