భారత్‌లో ఒమ్రికాన్‌ కేసు నమోదు కాలేదు: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి

No Case of Omicron in India so Far.. Health Minister in Rajya Sabha. భారత్‌లో ఇప్పటి వరకు ఒమ్రికాన్‌ వేరియంట్‌ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సూక్‌ మాండవీయ పార్లమెంట్‌ వేదికగా తెలిపారు.

By అంజి  Published on  30 Nov 2021 8:21 AM GMT
భారత్‌లో ఒమ్రికాన్‌ కేసు నమోదు కాలేదు: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి

భారత్‌లో ఇప్పటి వరకు ఒమ్రికాన్‌ వేరియంట్‌ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సూక్‌ మాండవీయ పార్లమెంట్‌ వేదికగా తెలిపారు. మంగళవారం నాడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. ఒమ్రికాన్‌ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల దగ్గర స్క్రీనింగ్‌ చేస్తున్నామని, అలాగే పాజిటివ్‌ కేసులకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నామని చెప్పారు. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమ్రికాన్‌ వేరియంట్‌ వ్యాప్తి ద్వారా ముప్పు పొంచి ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్‌ను పెంచాలని ఆదేశించామని మంత్రి మాన్సూక్‌ మాండవీయ తెలిపారు.

"ఈ కొత్త వేరియంట్ 14 దేశాలలో కనుగొనబడింది. భారతదేశంలో ఇంకా ఓమిక్రాన్ కేసు లేదు. మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము, జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేస్తున్నాము" అని ఆరోగ్య మంత్రి చెప్పారు. ఒమ్రికాన్‌ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు చేపట్టమాన్నారు. ఒమ్రికాన్‌ వేరియంట్‌ను ఆర్‌టీపీసీఆర్‌, యాంటీజెన్‌ పరీక్షల్లో గుర్తించవచ్చని ప్రభుత్వ వైద్య అధికారులు చెప్తున్నారు. తొలుత దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ ఇప్పుడిప్పుడే పలు దేశాల్లో విజృంభిస్తోంది. టీబీ వ్యాధి టెస్టింగ్‌పై కరోనా మహమ్మారి ప్రభావం పడిందా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. నిజానికి టీబీ టెస్టింగ్‌ తగ్గిందని, దాన్ని మళ్లీ రెట్టింపు చేస్తామని మంత్రి తెలిపారు. 2025 వరకు దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఉందన్నారు.

ఆరోగ్య మంత్రి ప్రకటనకు విరుద్ధంగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)లోని ఎపిడెమియాలజీ హెడ్ డాక్టర్ సమీరన్ పాండా 'దేశంలో ఇప్పటికే కొత్త జాతి ఉండవచ్చు. దానిని గుర్తించడానికి కొంత సమయం పట్టవచ్చు' అని నొక్కి చెప్పారు. B.1.1.529 కోవిడ్ వేరియంట్ లేదా ఒమిక్రాన్, గత వారం దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా కనుగొనబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని ఆందోళనకర వేరియంట్ గా గుర్తించింది. అంతకుముందు కేంద్రం వైరస్‌ విజృంభిస్తున్న దేశాల నుండి ప్రయాణించే వ్యక్తుల కోసం కఠినమైన మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. పరీక్ష-నిఘా చర్యలు, ఆరోగ్య సౌకర్యాలను పెంచడానికి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై సమీక్షించాలని కూడా నిర్ణయించింది.

Next Story