బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జనాభా నియంత్రణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణలో మగాళ్లు బాధ్యతగా ఉండరని.. మహిళలకు సరైన అవగాహన లేదని అన్నారు. దాని వల్లే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. వైశాలిలో ఓ పబ్లిక్ మీటింగ్‌లో నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. మగాళ్లకు ఏమీ పట్టదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అని వాళ్లు ఆలోచించరు. మహిళలకు దానిపై సరైన అవగాహన ఉండదు. మహిళలు వద్దు అని చెప్పలేకపోవడం వల్లే జనాభా నియంత్రణ జరగడం లేదు. మహిళల్లో ఎప్పుడైతే అవగాహన పెరుగుతుందో అప్పుడే అది వీలవుతుంది. గర్భం దాల్చకుండా మహిళలు తమను తాము రక్షించుకోవడం తెలుసుకోవాలని అన్నారు.
ఈ ప్రకటనపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర విమర్శలు చేస్తోంది. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ నితీశ్ కుమార్ మాటలు అసభ్యకరమైనవని అన్నారు. సీఎం పదవి గౌరవాన్ని దిగజార్చారని ఆరోపించారు. నితీశ్ కుమార్ అనుచిత పదజాలంతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని చౌదరి ఆరోపించారు.