హిందీ భాషపై మరోసారి రచ్చ

జేడీ(యూ) అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలుపై అసహనం వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on  20 Dec 2023 9:40 PM IST
హిందీ భాషపై మరోసారి రచ్చ

జేడీ(యూ) అధినేత, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలుపై అసహనం వ్యక్తం చేశారు. జాతీయ భాష హిందీ తెలిసి ఉండాలని సూచించారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ సమావేశంలో నితీశ్‌ కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన హిందీ ప్రసంగాన్ని డీఎంకే నేత టీఆర్‌ బాలు అర్ధం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో దానిని అనువాదం చేయాలని ఎదురుగా కూర్చొన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝాకు సైగ చేశారు. ఆ సమయంలో నితీష్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

నితీష్ కుమార్ హిందీ ప్రసంగానికి ఇంగ్లీషు అనువాదాన్ని ఇవ్వాలని డీఎంకే నేత టీఆర్‌ బాలు కోరారు. ఆయన అడగగానే బీహార్ ముఖ్యమంత్రి మండిపడ్డారు. హిందీ జాతీయ భాష.. అందరూ నేర్చుకోవాలి.. దానిని అర్థం చేసుకోగలగాలంటూ నితీష్ కుమార్ కోపగించుకున్నారు. ఇంతకు ముందు జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో RJD నాయకుడు మనోజ్ ఝా హిందీలోని ప్రసంగాలను ఆంగ్లంలోకి అనువదించారు. అయితే, నితీష్ కుమార్ ప్రసంగం చేసిన సమయంలో మాత్రం ఎలాంటి ఇంగ్లీష్ అనువాదం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగం, ఆ తర్వాత పలువురు నాయకులు చేసిన ప్రసంగాలను ఆంగ్లంలో అందించారు. అయితే నితీష్ కుమార్ తీరును ప్రజలు తప్పుబడుతూ ఉన్నారు. మరోసారి హిందీ గురించి వివాదం మొదలైంది.

Next Story