రేపు సీఎంగా మరోమారు ప్రమాణస్వీకారం చేయబోతున్న నితీశ్
Nitish Kumar back as CM. జేడీయూ నేత నితీశ్‌కుమార్ బీహార్ సీఎంగా మరోమారు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
By Medi Samrat Published on 15 Nov 2020 4:25 PM ISTజేడీయూ నేత నితీశ్‌కుమార్ బీహార్ సీఎంగా మరోమారు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసిన ఆయన తన ప్రమాణస్వీకారం విషయమై మీడియాతో మాట్లాడారు. తనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నితీశ్ తెలిపారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.
ఇదిలావుంటే.. నితీశ్ ను సీఎంగా ఎన్నుకోవడం కోసం ఎన్డీఏ కూటమిలోని పార్టీలైన బీజేపీ, జేడీయూ, హెచ్ఏఎమ్, వీఐపీ పార్టీల శాసనసభాపక్షాలు విడివిడిగా సమావేశమై ముఖ్యమంత్రి ఎన్నికపై చర్చించాయి. అనంతరం అన్ని పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు నితీశ్ నివాసానికి వెళ్లి ఉమ్మడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలు తమ నేతగా నితీశ్‌ను ఎన్నుకున్నారు.
శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన నితీశ్ వెంటనే కూటమి నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లతో ఒక జాబితాను అందజేశారు. దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ మరోమారు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇదిలావుంటే.. ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే గెలిచినవారు ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రతిపక్ష ఆర్జేడీ ప్రశ్నించింది. ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తారని ఆర్జేడీ నేత, ఎంపీ మనోజ్ జా ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని చెప్పారు. మళ్లీ ఆయనే అధికారం చేపట్టనుండటంతో ప్రజలు దీనిపై నిర్ణయం తీసుకుంటారని అన్నారు.