న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. 36 రాష్ట్రాల్లో 30 రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక పూర్తవడంతో, అవసరమైన కనీస 50 శాతం మద్దతు దక్కిన నేపథ్యంలో జాతీయ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ నెల జనవరి 16న ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్‌తో పాటు ఎలక్టోరల్ రోల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 19 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబీన్ అనుకూలంగా మొత్తం 37 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. స్క్రూటినీ అనంతరం అన్ని నామినేషన్ పత్రాలు నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత, సంగఠన్ పర్వ్‌కు జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డా. కె. లక్ష్మణ్ అధికారికంగా ప్రకటన చేస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే ఉండటంతో నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు వెల్లడించారు.