రోడ్డు ప్రమాద బాధితులకు 1,50,000 రూపాయల నగదు రహిత చికిత్స
భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలని తగ్గించడానికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat
భారతదేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలని తగ్గించడానికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాద బాధితులకు ఒకటిన్నర లక్ష రూపాయల వరకు నగదు రహిత చికిత్సను అందించబోతున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందేలా చూడడమే లక్ష్యంగా త్వరలోనే ఈ పథకాన్ని కేంద్రం దేశమంతటా అందుబాటులోకి తీసుకురాబోతోంది. . ప్రస్తుతం పైలట్ ప్రాజక్ట్ చేపట్టామని, 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం అందుబాటులోకి వస్తుందని నితిన్ గడ్కరీ చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగిన 7 రోజుల దాకా ఒకటిన్నర లక్ష రూపాయల వరకు వైద్యాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
రోడ్డు ప్రమాదం తర్వాత బాధితులకు అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’ సమయంలో వైద్య సహాయాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యమని గడ్కరీ తెలిపారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఈ స్కీమ్‌ను అమలు చేస్తుందని తెలిపారు. పోలీసులు, హాస్పిటల్స్, ప్రభుత్వ వైద్య సంస్థల సహకారం తీసుకోనున్నట్టు గడ్కరీ వెల్లడించారు. ఈ పథకం పైలట్ ప్రాజెక్టు 2024 మార్చి 14న చండీగఢ్‌లో ప్రారంభమైందని, ఆ తర్వాత ఆరు ఇతర రాష్ట్రాలకు విస్తరించామని గడ్కరీ తెలిపారు. ఈ పైలట్ పథకం ద్వారా ఇప్పటివరకు 6840 మంది ప్రయోజనం పొందారని గడ్కరీ చెప్పారు.