టీకాలు వేయించుకోని వ్యక్తులకు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి లేదు.. ఈ రాత్రి నుండే కర్ఫ్యూ
Night Curfew In Haryana, Unvaccinated To Be Banned From Public Places. ఓమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా హర్యానా ప్రభుత్వం రాత్రిపూట
By Medi Samrat Published on 24 Dec 2021 8:18 PM ISTఓమిక్రాన్ వేరియంట్ కేసుల దృష్ట్యా హర్యానా ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తరువాత రాత్రి కర్ఫ్యూ విధించిన మూడవ రాష్ట్రం హర్యానా. ఈ రాత్రి నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హర్యానా అంతటా రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు ప్రజల రాకపోకలు నిషేధించబడతాయని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన కోవిడ్ సమీక్షా సమావేశం జరిగింది.
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మాల్స్, రెస్టారెంట్లు, బ్యాంకులు, సబ్జీ మండీలు, ధాన్యం మార్కెట్లు, కార్యాలయాలలోకి ప్రవేశానికి రెండు టీకాలు వేసుకుని ఉండటం తప్పనిసరి అన్నారు. జనవరి 1 నుండి ఆ ప్రదేశాలలో 200 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించబోమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కొత్త వేరియంట్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాల్సిన అవసరం గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రెండు డోస్‌లు టీకాలు వేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కేసుల నివారణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించారు.
రెండు రోజుల క్రితం హర్యానా అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా.. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రకటించారు. ఓమిక్రాన్ వేరియంట్ భయాల మధ్య కోవిడ్‌పై సుదీర్ఘ పోరాటాన్ని ఈ చర్య బలోపేతం చేస్తుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారికి రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి అని డిసెంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత లక్ష మందికి పైగా టీకా రెండవ డోస్‌ను తీసుకున్నారని సీఎం ఖట్టర్ తెలిపారు. ప్రతిరోజూ 30-32 వేల మంది రోగులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని.. పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపుతున్నామని చెప్పారు.
ఇదిలావుంటే.. హర్యానాలో ఇప్పటివరకు ఆరు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వారిలో ముగ్గురు గురుగ్రామ్ నివాసితులు. విమానాశ్రయ స్క్రీనింగ్‌లో పాజిటివ్ నిర్ధారణ అవగానే వారు నేరుగా ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు. మరో ముగ్గురు ఫరీదాబాద్‌కు చెందినవారు.