రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు షాక్.. ఇంటిపైకి బుల్డోజర్..

NHAI officials raze compound walls of Prashant Kishor’s Bihar residence. రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ నేత ప్రశాంత్

By Medi Samrat  Published on  13 Feb 2021 7:31 AM GMT
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు షాక్.. ఇంటిపైకి బుల్డోజర్..

రాజకీయ వ్యూహకర్త, జేడీయూ మాజీ నేత ప్రశాంత్ కిశోర్‌కు షాక్ త‌గిలింది. ఆయ‌న‌ ఇంటి సరిహద్దు గోడలను బీహార్‌లోని బక్సర్ పాలనా యంత్రాంగం కూల్చివేసింది. అంతేకాక‌ ఇంటిలోని కొంత భాగాన్ని కూడా కూల్చివేసింది. ఆపై ఆ ఖాళీ స్థానాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది.

ఎన్‌హెచ్- 84 రోడ్డును ఫోర్‌లైన్స్‌గా మార్చేందుకు స్థానికంగా భూ సేకరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇళ్లు ఉన్న ప్ర‌దేశంలో కొంత భాగాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప‌లుకుబ‌డి ఉన్న ప్రశాంత్ కిశోర్ ఇంటి గోడలను కూల్చివేస్తున్న త‌రుణంలో.. అక్కడ జ‌నం భారీఎత్తున గుమిగూడారు. అయితే ఈ విష‌య‌మై ప్రశాంత్ కిశోర్ ఇప్పటివరకూ స్పందించ‌లేదు.

ఇదిలావుంటే.. ప్రశాంత్ కిషోర్ బిజెపి, కాంగ్రెస్‌ల‌తో పాటు ప‌లు ప్రాంతీయ పార్టీల‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. 2012 ఎన్నిక‌ల‌లో మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు.. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సహాయం చేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్ మొట్టమొదటి ప్రధాన రాజకీయ ప్రచారం చేసాడు. అనంత‌రం 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జ‌గ‌న్‌కు, ఆపై కిషోర్ 2020 దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాడు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ‌ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సార‌ధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు.


Next Story