మోదీ, యోగిలను పొగిడిన భార్యకు తలాక్ చెప్పిన భర్త
UP man gives triple talaq to wife for 'praising' PM Modi, Yogi Adityanath
By Medi Samrat Published on 24 Aug 2024 1:41 PM GMTఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళకు భర్త తలాక్ చెప్పాడు. అయోధ్య అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించినందుకు తన భర్త తనకు 'ట్రిపుల్ తలాక్' చెప్పాడని బాధిత మహిళ చెబుతోంది. ఆ వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన అత్త, భర్త, మరికొందరు కుటుంబ సభ్యులు తనను కొట్టారని కూడా ఆమె ఆరోపించింది.
బహ్రైచ్‌లోని థానా జర్వాల్ రోడ్‌లోని మొహల్లా సరాయ్ నివాసి అయిన మహిళకు డిసెంబర్ 13, 2023న, అయోధ్యలోని కొత్వాలి నగర్‌లోని మొహల్లా ఢిల్లీ దర్వాజా నివాసి ఇస్లాం కుమారుడు అర్షద్‌తో వివాహం జరిగింది. ఇరువర్గాల అంగీకారంతో శక్తికి మించి ఖర్చు పెట్టి మా నాన్న తన పెళ్లి చేశారని ఆ మహిళ వాపోయింది. పెళ్లయిన తర్వాత నగరానికి వెళ్లినప్పుడు అయోధ్య ధామ్‌లోని రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, అక్కడి వాతావరణం నాకు బాగా నచ్చాయి. దీనిపై నా భర్త ముందే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించానని ఆమె తెలిపింది. దీంతో భర్త ఆమెను తిరిగి తల్లిదండ్రుల ఇంటికి పంపించాడు.
కొన్ని రోజులకు బంధువులు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నించారు. ఆ మహిళ తన భర్తతో కలిసి జీవించడానికి అయోధ్యకు తిరిగి వచ్చింది. మరోసారి వారి మధ్య గొడవ జరిగి.. 'తలాక్, తలాక్, తలాక్' అని చెప్పి విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చిన రోజే భర్త కూడా తనను కొట్టాడని ఆరోపించింది మహిళ. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మహిళ భర్త అర్షద్, అత్త రైషా, బావ ఇస్లాం సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. దాడి, వేధింపులు, బెదిరింపులు, వరకట్న నిషేధ చట్టం, ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.