డ్రోన్ వినియోగం ఇక సులభతరం..!

New ‘Drone policy’ announced. డ్రోన్‌ల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. మానవ రహిత విమాన

By అంజి  Published on  27 Aug 2021 3:00 AM GMT
డ్రోన్ వినియోగం ఇక సులభతరం..!

డ్రోన్‌ల వినియోగాన్ని సులభతరం చేసిన కేంద్రప్రభుత్వం

డ్రోన్ కార్యకలాపాలపై కొత్త నిబంధనలు ప్రకటించిన కేంద్రం

మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు

డ్రోన్ దరఖాస్తు పత్రాల సంఖ్య 25 నుంచి 5 కు తగ్గింపు

వివిధ రకాల అనుమతి పత్రాల అవసరం ఉండదన్న కేంద్రం

ఢిల్లీ : డ్రోన్‌ల కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రకటించింది. మానవ రహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్ నిబంధనలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డ్రోన్ కార్యకలాపాలపై గత నెల 15న కేంద్ర ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలను తీసుకున్న కేంద్రం.. తాజాగా కొత్త నిబంధనలను వెలువరించింది. డ్రోన్ వినియోగానికి చేయాల్సిన అప్లికేషన్ పత్రాల సంఖ్యను 25 నుంచి 5కు కుదించింది. డ్రోన్ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు వివిధ పత్రాల అవసరం ఉండదని గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే డ్రోన్లు మోసుకెళ్లే సామర్థ్యాన్ని 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచగా.. మైక్రో డ్రోన్ల వినియోగానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదని తెలిపింది. అయితే ఇప్పటి వరకు వసూలు చేస్తున్న 72 రకాల ఫీజులను రద్దు చేసిన కేంద్రం.. వాటి స్థానంలో 4 రకాల ఫీజులను వసూలు చేయనున్నట్లు తెలిపింది.

గ్రీన్ జోన్లలో 400 మీటర్ల ఎత్తు వరకు డ్రోన్లను వినియోగించుకునేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. త్వరలోనే వస్తువుల డెలివరీలకు సంబంధించి ఓ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉంటే దేశ భద్రతా దృష్ట్యా నో పర్మిషన్ - నో టేకాఫ్, రియల్ టైమ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను పొందుపర్చారు. ఇవి నోటిఫైడ్ ఫీచర్లు కావడంతో ఆరు నెలల కాలపరిమితిని కేంద్రం నిర్ణయించింది. ఈ ఆరు నెలల్లోపు నిబంధనల మేరకు డ్రోన్‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాగా అన్ని రకాల డ్రోన్ శిక్షణ, పరీక్షలను డ్రోన్ స్కూళ్లు పూర్తి చేస్తాయి. అలాగే డ్రోన్‌లను దిగుమతిని డీజీఎఫ్‌టీ నియంత్రించనుంది. డ్రోన్ నిబంధనల విడుదల సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడుతూ.. రోడ్లపై ట్యాక్సీలను చూస్తున్న మాదిరిగానే.. త్వరలో ఎయిర్ ట్యాక్సీలు చూడబోతున్నామని పేర్కొన్నారు.


Next Story