అస్సాంలోని కమ్రూప్ జిల్లాలోని ఛయ్‌గావ్ ప్రాంతంలో 100కు పైగా అంతరించిపోతున్న రాబందులు చనిపోయాయి. మరికొన్ని ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. అస్సాంలోని ఛయ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిలన్‌పూర్ ప్రాంతంలో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గురువారం సాయంత్రం సుమారు 100 రాబందుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. రాబందులు మేక కళేబరాన్ని తిన్నాయని, విషపూరితమైన ఆహారం తినడం వల్లే చనిపోయాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
కమ్రూప్ వెస్ట్ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన జిల్లా అటవీ అధికారి (డిఎఫ్ఓ) డింపి బోరా మాట్లాడుతూ, ఒకేసారి దాదాపు 100 రాబందులు చనిపోవడాన్ని తాను మొదటిసారి చూశానని చెప్పారు. "రాబందుల కళేబరాల దగ్గర మేక ఎముకలు దొరికాయి.. విషపూరిత మేక కళేబరం తిని రాబందులు చనిపోయాయని అనుమానిస్తున్నాం.. అయితే మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలుతుంది.. మేక కళేబరంలో విషం కలిపిన వ్యక్తిని అరెస్ట్ చేస్తాం'' అని బోరా తెలిపారు. "ఈ ప్రాంతంలో ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటన జరిగింది, కానీ ఈసారి పెద్ద సంఖ్యలో రాబందులు చనిపోయాయి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా స్థానికులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాము," అని అధికారులు తెలిపారు.