ఎన్‌డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌ఖర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనకు మద్ధతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. "దేశ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను" అని ధన్‌ఖర్ తన నామినేషన్ అనంతరం వ్యాఖ్యానించారు.
"నాలాంటి నిరాడంబరమైన నేపథ్యం ఉన్న వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నాలాంటి 'కిసాన్ కుటుంబం'కి చెందిన ఒక నిరాడంబరమైన వ్యక్తికి ఇలాంటి చారిత్రాత్మక అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, నాయకత్వానికి కృతజ్ఞతలు'' అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జేడీ(యూ) చీఫ్ లాలన్ సింగ్, బీజేడీకి చెందిన పినాకి మిశ్రా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు పశుపతి కుమార్ పరాస్, అనుప్రియా పటేల్, రాందాస్ అథవాలే తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ధన్‌ఖర్.. తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎంపీల సమావేశానికి హాజరయ్యారు. ఆగస్టు 6న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా మార్గరెట్ అల్వాను ప్రకటించాయి.