ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌పై నార్కొటిక్స్ బ్యూరో అధికారులు చేసిన రెయిడ్‌లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ కొడుకు ఆర్యన్ కూడా అరెస్టయిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారందరికీ ముంబైలోని జేజే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆర్యన్‌తోపాటు అతని మిత్రులు మున్‌మున్ దమేచా, ఆర్బాజ్ సేత్ మర్చంట్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
అయితే ఆర్యన్ కు సంబంధించిన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఎన్సీబీ విచారణకు ఆర్యన్ హాజరైన సమయంలో ఒక వ్యక్తి అతనితో సెల్ఫీ తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎన్సీబీ అధికారే అని అందరూ అనుకున్నారు. అయితే అతనికి ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ''అతను ఎన్సీబీ అధికారి కాదు. అలాగే ఆఫీసులో పనిచేసే వ్యక్తి కూడా కాదు'' అని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్‌తో ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి ఎన్‌సిబి అధికారి లేదా ఉద్యోగి కాదని స్పష్టం చేసింది. ఇంతకూ ఆ వ్యక్తి ఎవరా అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది.