హర్యానాలో రాజకీయ గందరగోళం కొనసాగుతోంది. ఈ గందరగోళంలోనే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు చండీగఢ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మంత్రివర్గం కూడా రాజీనామా చేసింది. దీంతో కొత్త ముఖ్యమంత్రి పదవి రేసులో కీలకంగా వినిపిస్తున్న పేరు కురుక్షేత్ర ఎంపీ నయాబ్ సింగ్ సైనీ. ఖట్టర్ రాజీనామా అనంతరం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని పటిష్టంగా నడిపించగల నేతపై దృష్టి పెట్టిన అధిష్టానం తదుపరి సీఎంగా సైనీని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సైనీ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నైబ్ సింగ్ సైనీ వెనుకబడిన తరగతి (OBC)కి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ప్రస్తుతం కురుక్షేత్ర లోక్ సభ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. నాయబ్ సింగ్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌కు అత్యంత సన్నిహితుడు అవడం విశేషం. 1996లో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.
నయాబ్ సింగ్ 2009లో హర్యానాలోని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2012లో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో నయాబ్ నారాయణ్ గఢ్ అసెంబ్లీ నుండి ఎమ్మెల్యే అయ్యారు. 2015లో హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి అయ్యారు. 2019 నుంచి కురుక్షేత్ర ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.