దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్ తమ ఉనికిని చాటుకుంటూ ఉన్నారు. చాలా రాష్ట్రాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో నక్సలైట్ల దూకుడు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నక్సల్స్ పేలుడు పదార్థాలతో వంతెన, మొబైల్ టవర్‌ను పేల్చివేశారు. పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం రాత్రి రెండు గంటల నుంచి రెండున్నర గంటల మధ్య నక్సలైట్లు సింద్వారియా పంచాయతీ బరాకర్ నదిపై నిర్మించిన వంతెనను డిటోనేటర్‌తో పేల్చివేశారు. దీనికి తోడు నక్సలైట్లు మొబైల్ టవర్‌ను ధ్వంసం చేశారు.
వంతెన పేలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పేలుడు తర్వాత నక్సలైట్లు కరపత్రాలను కూడా విడుదల చేశారు. అరెస్టయిన నక్సలైట్ ప్రశాంత్ బోస్ దంపతులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అందులో పేర్కొన్నారు. జనవరి 21 నుంచి 26వ తేదీ వరకు జరిగే ప్రతిఘటన మార్చ్‌ను విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు రెండు చోట్ల మొబైల్ టవర్‌ను పేల్చివేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు.