డ్రగ్స్ అంశంపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృతా ఫడ్నవీస్‌కు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. డ్రగ్స్ వ్యాపారి జైదీప్ రానాతో ఫడ్నవీస్ దంపతులు దిగిన ఫొటోలను నవాబ్ మాలిక్ ట్విటర్‌లో పోస్టు చేశారు. బీజేపీకి, డ్రగ్స్ వ్యాపారుల మధ్య రిలేషన్‌పై చర్చిద్దాం అంటూ వ్యాఖ్యనించారు. కాగా నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. డ్రగ్స్ వ్యాపారులతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫొటోలో ఉన్న అతను.. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో తమతో కలిసి ఫొటోలు దిగాడని చెప్పారు.
ఇక అండర్ వరల్డ్ మాఫియాతో మాలిక్‌కు సంబంధాలు ఉన్నాయని ఫడ్నవీస్ పేర్కొన్నారు. ఆ వివరాలను దీపావళి పండగ తర్వాత వెల్లడిస్తానన్నారు. అయితే దీనిపై నవాబ్ స్పందిస్తూ.. నేను సిద్ధం అంటూ ట్వీట్ చేశారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్‌ను కలిశారు. తన క్యాస్ట్ సర్టిఫికెట్‌తో పాటు, మ్యారేజ్ డైవర్సర్ పత్రాలను అందించారు. వాంఖడే ఇచ్చిన పత్రాలను సరిచూస్తామని, పత్రాలు నిజమని తేలితే ఎలాంటి చర్యలు ఉండవని ఎస్సీ కమిషన్ తెలిపింది. సమీర్ వాంఖడే తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం సంపాదించాడని నవాబ్ మాలిక్ ఆరోపణలు చేశారు.