పంజాబ్‌ పీసీసీ ఛీప్‌గా సిక్స‌ర్ల సిద్ధూ..

Navjot Singh Sidhu appointed as Punjab Congress chief. క్రికెట‌ర్‌గా మైదానంలో అద‌ర‌గొట్టిన‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అలియాస్‌ 'సిక్సర్ల‌ సిద్ధూ'

By Medi Samrat
Published on : 19 July 2021 4:26 PM IST

పంజాబ్‌ పీసీసీ ఛీప్‌గా సిక్స‌ర్ల సిద్ధూ..

క్రికెట‌ర్‌గా మైదానంలో అద‌ర‌గొట్టిన‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అలియాస్‌ 'సిక్సర్ల‌ సిద్ధూ' పంజాబ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీపీసీసీ) అధ్యక్షుడిగా నియ‌మితులయ్యారు. ఈ మేర‌కు పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సిద్ధూతో పాటు న‌లుగురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల‌ను కూడా నియ‌మించింది కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం. సంగ‌త్ సింగ్‌, సుఖ్వింద‌ర్ సింగ్‌, ప‌వ‌న్ గోయ‌ల్, కుల్జిత్ సింగ్‌ల‌ను వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. ఇదిలావుంటే.. క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన సిద్ధూ.. 2004లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున అమృత్‌సర్‌ నుంచి విజయం సాధించారు. 2014 వరకూ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

అయితే.. 2014లో అమృత్‌సర్‌ స్థానాన్ని బీజేపీ దివంగత నేత అరుణ్‌జైట్లీకి కేటాయించింది. సిట్టింగ్‌ ఎంపీ అయిన సిద్ధూకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత బీజేపీ సిద్ధూను 2016లో రాజ్యసభకు పంపింది. అయితే.. 2017లో పంజాబ్‌ ఎన్నికల ముందు సిద్ధూ బీజేపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎర్రిక‌ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అమృత్‌సర్‌ తూర్పు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017 నుంచి 2019 వరకు అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గంలో స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతికశాఖ మంత్రిగా పనిచేశారు. ప్ర‌స్తుతం పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.


Next Story