పంజాబ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది కాంగ్రెస్. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. ఇందుమూలంగా నేను అధ్యక్ష (పిపిసిసి) పదవికి రాజీనామా చేస్తున్నానని అని సిద్ధూ లేఖలో రాశారు. పంజాబ్ కాంగ్రెస్‌లో గొడవలు నేఫథ్యంలో ఎన్నికల్లో మూడొంతుల మెజారిటీతో ఆప్ అధికారంలోకి వచ్చింది.
పంజాబ్‌లో సిద్ధూ, ఉత్తరాఖండ్‌లో గణేష్ గోడియాల్, ఉత్తరప్రదేశ్‌లో అజయ్ కుమార్ లల్లూ, గోవాలో గిరీష్ చోడంకర్, మణిపూర్‌లో నమీరక్‌పామ్ లోకేన్ సింగ్‌లను రాజీనామా చేయాలని సోనియా గాంధీ ఒకరోజు ముందుగానే కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సిద్ధూ.. బలమైన అమృత్‌సర్ (తూర్పు) స్థానం నుంచి ఓటమిని చవిచూశారు. సిద్ధూ ఆప్ అభ్యర్థి జీవన్‌జ్యోత్ కౌర్ చేతిలో 6,750 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశాడు.
సిద్ధూ బీజేపీ నుంచి మూడుసార్లు అమృత్‌సర్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన తన 'గురువు' అరుణ్ జైట్లీ కోసం ఈ సీటును "త్యాగం" చేశారు. ఆ తర్వాత ఆయనను బీజేపీ రాజ్యసభకు పంపింది. కానీ సిద్దూ తదనంతర పరిణామాలలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.