నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

National Vaccination New Guidelines. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ సరఫరా

By Medi Samrat  Published on  8 Jun 2021 4:09 PM IST
నేషనల్ వ్యాక్సినేషన్ పాలసీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

జాతీయ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. జాతీయ టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం రాష్ట్రాల‌కు నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త గైడ్‌లైన్స్ 21వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. టీకాలు ప్రభుత్వ కేంద్రాల ద్వారా ఉచితంగా అందజేయాలని రాష్ట్రాల‌కు వెల్లడించింది కేంద్రం. 18 ఏళ్ళు పైబడిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలా.. వద్దా.. అనే విషయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

వ్యాక్సిన్ లు వేస్ట్ చేస్తే.. దాని ప్రభావం త‌దుప‌రి కేటాయింపులపై ఉంటుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ల సరఫరాపై ఆయా రాష్ట్రాలకు ముందే సమాచారం అందిస్తామని.. జిల్లా, టీకా కేంద్రాల స్థాయిలో వ్యాక్సిన్ లభ్యత సమాచారం పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టంచేసింది. అలాగే.. వైరస్ తీవ్రత, జనాభా, వ్యాక్సినేషన్ పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు కేటాయించాలని నిర్ణయించారు.

టీకా తయారీదారుల నుంచి నెలవారీ ఉత్పత్తిలో 75శాతం వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వం సేకరించాలని నిర్ణయించింది. మిగతా 25 టీకాలు ప్రైవేటు ఆస్పత్రిలకు ఇవ్వొచ్చని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు టీకాల కోసం సర్వీస్ ఛార్జ్ రూ.150లకు మించకూడదు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై నిఘా ఉంచాలని కోరింది.

పౌరులందరూ ఆదాయ స్థితితో సంబంధం లేకుండా ఉచిత టీకాలకు అర్హులని కేంద్రం తెలిపింది. కో-విన్ ప్లాట్‌ఫాం ప్రతి పౌరుడికి టీకాల బుకింగ్‌ను సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రీ-బుకింగ్ చేసే సదుపాయాన్ని అందిస్తుందని కేంద్రం వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ టీకా కేంద్రాలు ఆన్‌సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తాయని తెలిపింది.


Next Story